6:15pm | కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మైక్ వార్

6:15pm | కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మైక్ వార్
6:15pm | ఇద్దరు అగ్రనేతలు ఒకే సమయంలో
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయ క్షేత్రం నేడు ఇద్దరు అగ్రనేతలు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఒకే సమయంలో బహిరంగ సభల్లో ప్రసంగించబోతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాదాపు ఏడాది కాలంగా బహిరంగ సభలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు జగిత్యాల వేదికగా జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’ ద్వారా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. సాయంత్రం 6:15 గంటలకు కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే సందర్భంగా ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటనలో ఉన్నారు. ఉదయం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన, సాయంత్రం 6:15 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లికి చేరుకుంటారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలపై ప్రసంగిస్తారు.
ఉత్కంఠ..

కేసీఆర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరిగ్గా అదే సమయానికే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతుండటం ఇప్పుడుచర్చనీయాంశమైంది. కేసీఆర్ స్పీచ్‌కు మీడియా కవరేజీ, ప్రజల దృష్టి మళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ లోపాలను ఎత్తిచూపుతూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలు, దానికి కేసీఆర్ ఇచ్చే కౌంటర్లపై రెండు పార్టీల కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
