కొనుగోలు జాప్యం రైతుకు శాపం..

కొనుగోలు జాప్యం రైతుకు శాపం..
వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట
అకాల వర్షంతో అచ్చంపేట రైతుల ఆవేదన
అచ్చంపేట, మే 23 (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలో శనివారం అకస్మాత్తుగా కురిసిన ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో తూకం వేసి రవాణాకు సిద్ధంగా ఉంచిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసి భారీగా నష్టపోయింది.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్మకానికి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన రైతులు దాదాపు నెల రోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గన్నీ బ్యాగుల కొరత, లారీల సమస్యల కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడంతో వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న యార్డులోనే నిల్వ ఉండిపోయింది. ఇదే సమయంలో కురిసిన అకాల వర్షం రైతుల ఆశలను నీరుగార్చింది.

తమ కళ్లముందే పంట తడిసి పాడవుతుండటాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. “పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి పండించిన పంట ఇది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు” అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్ యార్డులో సరైన రక్షణ చర్యలు లేకపోవడం, కొనుగోళ్లలో జాప్యం, రవాణా సదుపాయాల లోపం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. తడిసిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం
శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులోకి వరద నీరు చేరడంతో మొక్కజొన్న ధాన్యం కొంత వరద నీటిలో కొట్టుకుపోయింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అచ్చంపేట తహసీల్దార్ సైదులు, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, ఎస్సై సద్దాం సిబ్బందితో కలిసి మార్కెట్ యార్డును పరిశీలించారు.
టిప్పర్ల ద్వారా మట్టిని తెప్పించి మార్కెట్ యార్డులోకి వరద నీరు రాకుండా డైవర్షన్ చర్యలు చేపట్టారు.
