ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యం..
గుడివాడ నియోజకవర్గంలో తాగునీటి నాణ్యతపై ఎమ్మెల్యే రాము ప్రత్యేక సమీక్ష..
గ్రామాల వారీగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు సిద్ధం చెయ్యండి….
ప్రజారోగ్యం విషయంలో రాజీపడేది లేదు…
గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో గ్రామాల వారీగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే రాము సూచించారు. దీనికి అనుగుణంగా మండల పరిషత్ అధికారులు, రూరల్ వాటర్ సప్లై అధికారులు రూపొందించిన నివేదికలను ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…
పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీపడేది లేదనీ,క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలనీ స్పష్టం చేశారు. నీటి నాణ్యతలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే సరిచేయాలనీ, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, నందిపేట మండలం పార్టీ ప్రెసిడెంట్ దానేటి సన్యాసి రావు,గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండల పరిషత్ అధికారులు విష్ణు ప్రసాద్, మల్లీశ్వరి, ఇమ్రాన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూపేష్ మరియు కిస్మత్ రాణి సమావేశంలో పాల్గొన్నారు.

