రైల్వే స్టేషన్లో ‘స్లీపింగ్ పాడ్స్’ సేవలు ప్రారంభం
విజయవాడ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి…
ప్రయాణికుల విశ్రాంతికి ఆధునిక, సురక్షిత, చౌకైన వసతి అందుబాటులోకి
168 స్లీపింగ్ పాడ్స్.. మహిళలకు ప్రత్యేకంగా 14 పాడ్స్..
ఫ్యామిలీ కోసం 3 క్యాబిన్లు….
మూడు గంటలకు రూ.200…
12 గంటలకు రూ.400 రుసుము వసూలు
విజయవాడ డివిజన్లో తొలి సౌకర్యం..
దక్షిణ కోస్తా రైల్వేలో మూడోది ఏర్పాటు..
ప్రయాణికుల సౌకర్యాలతో పాటు ఐదేళ్లలో రూ.3.55 కోట్ల ఆదాయ లక్ష్యం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దీర్ఘకాలం రైలు కోసం వేచి ఉండే ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ‘స్లీపింగ్ పాడ్స్’ సేవలను దక్షిణ కోస్తా రైల్వే ప్రారంభించింది. విజయవాడ రైల్వే స్టేషన్ లోనే ప్లాట్‌ఫాం నంబర్–1లో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం ద్వారా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన విశ్రాంతి పొందే అవకాశం కల్పించారు.
మరింత సౌకర్యవంతంగా….
ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ పాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తర్వాత మూడో స్లీపింగ్ పాడ్స్ కేంద్రం కాగా, విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేయగా, వాటిలో 14 పాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు మూడు ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ప్రతి పాడ్‌లో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, వ్యక్తిగత లాకర్, హైస్పీడ్ వై-ఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సౌకర్యవంతమైన బెడ్డింగ్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా చెల్లింపు ప్రాతిపదికన వేడి నీరు, ప్యాకేజ్డ్ ఆహారం, తాగునీరు, శీతల పానీయాలు కూడా అందించనున్నారు. ప్రయాణికులు మూడు గంటల వరకు రూ.200, 12 గంటల వరకు రూ.400 చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. స్టేషన్లోనే నేరుగా లేదా 8367769888, 9517649999 నంబర్ల ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. చెల్లుబాటు అయ్యే రైలు టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిన ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ప్రయాణికులకు అందుబాటులో…
ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ పాడ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వల్పకాలిక వసతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా, నాన్-ఫేర్ రెవెన్యూ (ఎన్ఎఫ్ఆర్) పథకం కింద వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.3.55 కోట్ల ఆదాయం సమకూర్చే అవకాశం ఉందని వెల్లడించారు.
