పొంగులేటిపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు
–భూ భారతి స్కాంపై బీఆర్ఎస్ ఫైర్
-సీబీఐ విచారణకు డిమాండ్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్కాంలలో ఇదే అతిపెద్దదని, సుమారు రూ.10 వేల కోట్ల విలువైన భూ స్కాం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూ భారతి సాఫ్ట్వేర్ను మార్చి అక్రమంగా భూములను బదలాయించారని ఆయన విమర్శించారు. ఈ స్థాయిలో స్కాం జరిగితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియకుండా ఎలా జరిగిందని ప్రశ్నించారు.
నిజంగానే ఈ వ్యవహారం తనకు తెలియదని మంత్రి చెబితే, కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. భూ వ్యవహారాల్లో అక్రమాలకు సహకరించేలా అధికారులను బదిలీలు, పదోన్నతులు ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే కమీషన్లు తీసుకుని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని భూ మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.
