కాంగ్రెస్ పాలనలో పారదర్శకత.. బీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారం
చిట్యాల, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో రెండున్నరేళ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కిరాల మధువంశీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య పేర్కొన్నారు.
మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల, రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అండగా నిలుస్తున్నామని చెప్పారు.
మొక్కజొన్న రైతులకు అన్యాయం జరిగితే పూర్తి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మూడు మండలాల నాయకులు, దళారులతో కలిసి ధర్నా నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా పెరిగాయని, పేదల భూములను ఆక్రమించి దుర్వినియోగ పాలన సాగించారని ఆరోపించారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజల మనిషిగా పనిచేస్తున్నారని, చిల్లర రాజకీయాలు మానుకుని ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేయడం సరికాదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత పాలకులు తమ ఫామ్‌హౌస్‌లకు నీటిని తరలించుకున్నారని ఆరోపిస్తూ, భూపాలపల్లి నియోజకవర్గానికి చుక్క నీరైనా అందించారా అని ప్రశ్నించారు.
మొక్కజొన్న కొనుగోలులో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తూ వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా, మండల నాయకులు గంగాధరి రవీందర్, చిలుకల రాయకొంమురు, దబ్బేట అనిల్, గడ్డం కొమరయ్య, బుర్ర శ్రీనివాస్, అల్లకొండ కుమార్, కట్కూరి నరేందర్, గుర్రపు తిరుపతి, బుర్ర లక్ష్మణ్, అల్లం రాజు, కొక్కుల సదానందం తదితరులు పాల్గొన్నారు.
