నున్న‌ పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం

ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి ఏ. కృష్ణమోహన్
మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, వినూత్న బోధనా విధానాలపై ప్రశంసలు
40 సెకన్లలో ఆవర్తన పట్టిక చెప్పిన విద్యార్థులను అభినందించిన తనిఖీ అధికారి

విజయవాడ రూర‌ల్, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నూన్నలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఆర్ఈఐఎస్) కార్యదర్శి, రాష్ట్ర పీఎం శ్రీ పాఠశాలల తనిఖీ అధికారి ఏ. కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, క్రీడా మైదానాలు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాలను పరిశీలించారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మమేకమై పీఎం శ్రీ మార్గదర్శకాల అమలు, విద్యా నాణ్యత, బోధనా విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యతో కూడిన ఉత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దే కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకం అమలు పురోగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగానే ఈ తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉపాధ్యాయుల‌తో క‌ల‌సి మొక్క‌ను నాటారు.
విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించిన కృష్ణమోహన్‌ను మట్టా కృష్ణ సుప్రియ, ఆమె సోదరుడు మట్టా సూర్య‌ విశేషంగా ఆకట్టుకున్నారు.

కేవలం 40 సెకన్లలో ఆవర్తన పట్టికలోని అన్ని మూలకాలను వరుసగా చెప్పి తమ ప్రతిభను చాటడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ప్రతిభను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కూడా ఆయన ప్రశంసించారు. పాఠశాల సమగ్ర పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణమోహన్, ప్రధానోపాధ్యాయుడు, బోధన, బోధనేతర సిబ్బంది అంకితభావాన్ని కొనియాడారు. విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

వారి సహకారంతో మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు మరింత మెరుగుపడ్డాయని, ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి సామాజిక భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.
నున్న పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోని అన్ని పీఎం శ్రీ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. సిబ్బంది అంకితభావం, మౌలిక సదుపాయాల నాణ్యత, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం పీఎం శ్రీ కార్యక్రమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి అని కృష్ణమోహన్ పేర్కొన్నారు.

ఇప్పటికే సాధించిన ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తూ, వినూత్న బోధనా పద్ధతులు, డిజిటల్ లెర్నింగ్, విలువల ఆధారిత విద్యకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. ఈ తనిఖీలో సమగ్ర శిక్ష సహాయ విద్యా పర్యవేక్షణ అధికారి (ఏఏఎంఓ) సిహె శిరీష‌, ప్రధానోపాధ్యాయుడు సురపనేని రవి ప్రసాద్, సిబ్బంది కార్యదర్శి పి. నాగేశ్వరరావు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి నరెడ్ల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.