Revanthreddy | ప్రభుత్వ బడులే భవిష్యత్‌కు పునాది

Revanthreddy | ప్రభుత్వ బడులే భవిష్యత్‌కు పునాది

మట్టిలో మాణిక్యాలు వెలికితీస్తాం

Revanthreddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలల ద్వారానే మట్టిలో మాణిక్యాలను వెలికితీయగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఆరుట్ల పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.27 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తోందని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకే కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో టీపీఎస్‌లను నిర్మిస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికే ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

“విద్య అనేది ఖర్చు కాదు.. అది భవిష్యత్తుపై పెట్టుబడి. విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగించవచ్చు” అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ముఖ్యమంత్రులు అయిన వారు ఉన్నారని గుర్తుచేశారు.

గత ప్రభుత్వం కులాల వారీగా పాఠశాలలను ఏర్పాటు చేసి విభజనను ప్రోత్సహించిందని ఆరోపించిన సీఎం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే తేడాలు లేకుండా అందరూ కలిసి చదివేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకురావడంపై వచ్చిన విమర్శలను కూడా ఆయన ప్రస్తావించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికే మెస్సీని ఆహ్వానించామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందించిన యూనిఫామ్‌లు నాణ్యతలేక త్వరగా చిరిగిపోయేవని విమర్శించిన సీఎం, ప్రస్తుతం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.