Kadapa 765KV Line | పచ్చని పొలాల్లో 765 కేవీ ట్రాన్స్‌మిషన్ టవర్లు

Kadapa 765KV Line | సాగుభూముల మీదుగానే ట్రాన్స్‌మిషన్ లైన్.. ప్రత్యామ్నాయ మార్గం కోరుతున్న రైతులు

100 అడుగుల రైట్ ఆఫ్ వేతో భూముల విలువ పడిపోతుందనే భయం

గడువులోనే అభ్యంతరాలు తెలిపినా స్పందించని సంస్థపై రైతుల ఆవేదన

గుట్టల మీదుగా లైన్ తీసుకెళ్లే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు

రైతుల అభ్యంతరాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్న తహసీల్దార్

Kadapa 765KV Line | కడప, ఆంధ్రప్రభ బ్యూరో: అనంతపురం-2 ఆర్‌జెడ్ నుంచి చిన్నకాంపల్లి 765 కేవీ పవర్ గ్రిడ్ సబ్‌స్టేషన్ వరకు ప్రతిపాదించిన 765 కేవీ హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మాణం చింతకొమ్మదిన్నె మండల రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. రైతుల సాగుభూముల మీదుగా విద్యుత్ లైన్ నిర్మించేందుకు రూపొందించిన ప్రస్తుత డిజైన్‌ను రద్దు చేసి, సమీప గుట్టల మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో నిర్మాణం చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ విషయమై మండల తహసీల్దార్ నాగేశ్వరరెడ్డిని కలిసి రైతులు తమ అభ్యంతరాలను వివరించారు. ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్టెరిలైట్ (రిసోనియా) సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ భూముల్లో గుంతలు తవ్వే ప్రయత్నాలను అడ్డుకున్నామని, ప్రారంభించిన కొన్ని పనులను కూడా నిలిపివేయించామని రైతులు తెలిపారు.

100 అడుగుల రైట్ ఆఫ్ వేతో భూముల విలువపై ఆందోళన

765 కేవీ ట్రాన్స్‌మిషన్ టవర్ల మధ్యుగా వెళ్లే విద్యుత్ లైన్ల కారణంగా ఇరువైపులా సుమారు 100 అడుగుల వెడల్పు రైట్ ఆఫ్ వే పరిధిలోకి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో ఆ భూముల వినియోగంపై పరిమితులు ఏర్పడటమే కాకుండా, మార్కెట్ విలువలు భారీగా పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరతరాలుగా సాగు చేస్తున్న భూములను వారసులకు అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నామని, అలాంటి భూములపై విద్యుత్ లైన్లు వెళితే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని రైతులు వాపోతున్నారు.

గడువులోనే అభ్యంతరాలు.. అయినా స్పందన లేదు

ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణానికి సంబంధించి 2025 ఏప్రిల్ 9న స్టెరిలైట్ సంస్థ అభ్యంతరాలు తెలియజేయాలని ప్రకటన విడుదల చేసిందని రైతులు తెలిపారు. నిర్ణీత గడువులోనే రిజిస్టర్డ్ పోస్టులు, ఈ-మెయిళ్ల ద్వారా తమ అభ్యంతరాలు పంపినప్పటికీ సరైన స్పందన రాలేదని పేర్కొన్నారు.

తరువాత రైతుల ప్రతినిధులు గురుగ్రామ్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్లి అధికార ప్రతినిధులు, డైరెక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదని వాపోయారు.

గుట్టల మీదుగా మార్గం సాధ్యమేనంటున్న రైతులు

గొర్లపల్లె సమీపంలోని చెరువు వద్ద ప్రతిపాదించిన ఆర్-1-104 టవర్ నుంచి నేరుగా చిన్నకాంపల్లి పవర్ గ్రిడ్ వరకు గుట్టల మీదుగా లైన్ తీసుకెళ్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. కమ్మవారిపల్లె, చింతకొమ్మదిన్నె, కొలుములపల్లె, పెద్దకాంపల్లి ప్రాంతాల గుట్టలపై నుంచి లైన్ వెళితే వ్యవసాయ భూములకు నష్టం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

చిన్నకాంపల్లి పవర్ గ్రిడ్ విద్యుత్ లైన్ల వల్ల ఇప్పటికే భూముల విలువలు తగ్గాయని, ఇప్పుడు మరో 765 కేవీ లైన్ వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని కమ్మవారిపల్లె, బుసిరెడ్డిపల్లె, అప్పరాజుపల్లె, చింతకొమ్మదిన్నె, కొలుములపల్లె, జమ్మలపల్లె రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గొర్లపల్లెకు చెందిన రమణారెడ్డి మాట్లాడుతూ, విద్యాసంస్థ నిర్మాణం చేపట్టిన ప్రాంతం మీదుగా లైన్ వెళ్లేలా డిజైన్ చేయడం సరికాదని, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు.

ఉన్నతాధికారులకు నివేదిక

రైతులు, సంస్థ ప్రతినిధులతో సమావేశమైన తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి రైతుల అభ్యంతరాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రత్యామ్నాయ మార్గం సాధ్యమైనప్పటికీ రైతుల సాగుభూములపైనే లైన్ కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన రైతుల్లో నెలకొంది.

పచ్చని పొలాలు, కోట్ల రూపాయల విలువైన భూములు, వేలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల ఆందోళనకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. రైతుల జీవనాధారాన్ని కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని మండలవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది.