యూరియా సరఫరా చేయని ప్రభుత్వం గద్దె దిగాలి
యూరియా సరఫరా చేయని ప్రభుత్వం గద్దె దిగాలి
ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
బిక్కనూర్, (ఆంధ్రప్రభ): రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు, రైతులు యూరియా కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు లేకుండా రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని, ఎకరాకు నాలుగు బస్తాల చొప్పున యూరియా కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, భూమిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామచంద్రం, వేణు, నర్సారెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రభాకర్, దేవరలక్ష్మి, రవీందర్ రెడ్డి, బిక్షపతి, సాయిరెడ్డి, రంజిత్ వర్మ, బసవయ్యతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
