Revanth Reddy | పాలమూరుకు మరణశాసనం రాసింది కేసిఆరే…

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బయటకు రావడం సంతోషకరమని, ఆయన చేసిన విమర్శలకు అసెంబ్లీ వేదికగానే సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన చిట్ చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్ తన ప్రసంగంలో పాత అబద్ధాలనే మళ్లీ వల్లిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పదేళ్ల హయాంలోనే తెలంగాణ నీటి వాటాలకు గెండి పడిందని, ఎక్కువ జలదోపిడీకి ఆయనే కారకుడని ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో మనకు రావాల్సిన 811 టీఎంసీల నికర జలాల్లో కేవలం 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి, ఉమ్మడి మూడు జిల్లాలకు కేసీఆర్ మరణ శాసనం రాశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తాము ఇప్పుడు కృష్ణా జలాల్లో 71 శాతం వాటా కోసం పట్టుబడుతున్నామని, ఏపీ జలదోపిడీకి గత పదేళ్లలో కేసీఆర్ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు.
జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ కచ్చితంగా రావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. “నీళ్లు- నిజాలు” అనే అంశంపై అసెంబ్లీ సాక్షిగా ముఖాముఖి చర్చకు తాను సిద్ధమని, గతంలో జరిగిన విధ్వంసంపై అలాగే భవిష్యత్తు ప్రణాళికపై అక్కడ తేల్చుకుందామని సవాల్ విసిరారు.
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఆర్థిక ఉగ్రవాదులని విమర్శిస్తూ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూస్తానని, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విన్నవిస్తానని హామీ ఇచ్చారు.
బహిరంగ సభల్లో చిల్లర మాటలు మాట్లాడటం కంటే, సభకు వచ్చి తమ బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చర్చించాలని సూచించారు. చర్చకు పిలిస్తే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని, కేటీఆర్, హరీశ్ రావు కలిసి ఆయన్ను రాజకీయంగా నిర్బంధించారని సీఎం ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వయసుకు తగినట్లు కాకుండా అసహనంతో మాట్లాడుతున్నారని, ఆయన తమలపాకుతో కొడితే తాను తలుపు చెక్కతో కొట్టే రకం అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌కు బయటి వాళ్ల వల్ల ఎలాంటి ముప్పు లేదని, ఆయన కుటుంబ సభ్యుల వల్లే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.
పార్టీని హస్తగతం చేసుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు మధ్య పెద్ద పోటీ నడుస్తోందని, ఒకవేళ పార్టీని టేకోవర్ చేస్తే హరీశ్ రావుకు ఒక్కసారిగా ఐదు వేల కోట్లు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల విషయంలో తాము సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనలు, సాంకేతిక నిపుణుల సలహాల మేరకే ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎవరికైనా అనుమానాలుంటే నిజనిర్ధారణ కమిటీ వేయడానికి కూడా తాము సిద్ధమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
