Baluchistan | స్కూల్ బ‌స్సుపై కారు బాంబుతో దాడి… అయిదుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం

బ‌లూచ్ – పాకిస్థాన్‎ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కారు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో అయిదుగురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడును అక్కడి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. మరోవైపు అధికారులు ఈ దాడి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

తీవ్రంగా ఖండించిన హోంమంత్రి

సమాచారం ప్రకారం, స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన వెంటనే సహాయ, రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను క్వెట్టా, కరాచీలోని పెద్ద ఆసుపత్రులకు తరలించారు. పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. దేశంలో భయాన్ని, అస్థిరతను వ్యాప్తి చేయడమే వారి దాడి ఉద్దేశమని, అయితే ప్రభుత్వం, భద్రతా దళాలు వీటిని విజయవంతం చేయనివ్వవని వెల్లడించారు.

Leave a Reply