హామీలతో మభ్యపెట్టి.. ప్రజలపై భారాలు!

రైతు ఆదాయం రెట్టింపు ఎక్కడ?..

ఉద్యోగాల హామీ ఏమైంది?
సెప్టెంబర్‌ 1న చలో ఢిల్లీ విజయవంతం చేయాలి

హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి ఆరోపించారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ సీపీఐ చేపట్టిన ప్రచార జాత ఐనవోలు మండలంలో కొనసాగింది.

వెంకటాపూర్‌, కానిపర్తి, తరాలపల్లి గ్రామాల్లో పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించారు. ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కర్రె బిక్షపతి మాట్లాడారు.

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని, నిరుద్యోగులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలుపై కేంద్రం దృష్టి సారించలేదని విమర్శించారు.

వ్యవసాయ రంగంలో సబ్సిడీల తగ్గింపు, పంటలకు గిట్టుబాటు ధరల సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు నడిపించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోపించారు.

ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలను కేంద్రం అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 6 నుంచి 11 వరకు సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార జాతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిపై పోరాటాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమాలకు ముగింపుగా సెప్టెంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘బద్లావ్‌ జరూరీ హై’ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కర్రె బిక్షపతి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్‌, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్‌, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజానాట్యమండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు.