దేశం కోసం ప్రాణం.. జిల్లాకు గర్వకారణం!
- అమర జవాన్ మురళీ నాయక్ విగ్రహావిష్కరణ
- పుట్టపర్తి శిల్పారామంలో ఘనంగా కార్యక్రమం.. కలెక్టర్, ఎస్పీ నివాళులు
- యువతకు మురళీ నాయక్ త్యాగం స్ఫూర్తిదాయకం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ సరిహద్దులను కాపాడుతూ మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్ త్యాగానికి పుట్టపర్తి శిల్పారామం వేదికగా ఘన నివాళి లభించింది. ఆయన జ్ఞాపకార్థం శిల్పారామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి అమర వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.
సరిహద్దులో వీరోచిత పోరాటం..

2025 మే 9న జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ బలగాలు జరిపిన కాల్పులను ధీటుగా ఎదుర్కొంటూ మురళీ నాయక్ అత్యున్నత త్యాగం చేశారని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. చిన్న వయస్సులోనే దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆయన త్యాగం వర్ణనాతీతమన్నారు.
మురళీ నాయక్ ధైర్యసాహసాలు, దేశభక్తి జిల్లా యువతకు, రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సైనికుల త్యాగాల వల్లే మనకు భద్రత
మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ అమరత్వం అమూల్యమైనదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సరిహద్దుల్లో సైనికులు అహర్నిశలు విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కాపాడుతున్నారని, వారి త్యాగాల వల్లే ప్రజలంతా ప్రశాంతంగా, సురక్షితంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. మురళీ నాయక్ వీరగాథను శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఆయన త్యాగం ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతుందని అన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా స్థాయి అధికారులు, ఆర్మీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమర వీరుడి విగ్రహం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
