రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఎండుతున్న పంటలు..

నీరు లేక కకావికలమవుతున్న అన్నదాత
ఎన్నికల హామీలు నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం..

కొత్త పర్వతాలు యాదవ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని చౌటుప్పల్ మండల రైతుబంధు మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్ విమర్శించారు.

సమయానికి వర్షాలు కురవక, మరోవైపు సాగునీటి వసతి లేక పొలాల్లో పంటలు కళ్లముందే ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు, రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని పూర్తిగా మర్చిపోయిందని దుయ్యబట్టారు.

రైతులందరికీ రూ.2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం కొందరికే పరిమితం చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు.

నిరంతరం అందుబాటులో ఉండాల్సిన రైతుబంధు సాయాన్ని ఇప్పటివరకు మూడుసార్లు ఎగ్గొట్టి, ఒక్కసారి మాత్రమే ఇచ్చారని విమర్శించారు. సాగు భూములన్నింటికీ రైతుబంధు ఇస్తామని చెప్పి, నీటి వసతి లేక పంటలు వేయలేకపోయిన రైతులకు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టడం దారుణమన్నారు.

వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఆడబిడ్డల వివాహాలకు తులం బంగారం, యువతులకు నెలకు రూ.2,500 సాయంతో పాటు స్కూటీలు ఇస్తామన్న హామీలు కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

చౌటుప్పల్ మండలానికి సరైన సాగునీటి వనరులు లేవని పర్వతాలు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు నిండాలంటే కేవలం భారీ వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి ఇప్పట్లో సాగునీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో మూసీ జలాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున, సుమారు రూ.45 కోట్ల తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరేలా మైసమ్మ కత్వ నుంచి లిఫ్ట్ ద్వారా మూసీ జలాలను చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం, తంగడపల్లి, దండు మల్కాపురం, కైతాపురం, లక్కారం, చౌటుప్పల్ గ్రామాలతో పాటు సంస్థాన్ నారాయణపురం మండలంలోని జానకమ్మ తదితర చెరువుల్లోకి మళ్లించాలని డిమాండ్ చేశారు.

మూసీ జలాలను చెరువుల్లోకి మళ్లిస్తే చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతాయని, భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగి చౌటుప్పల్ ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మూసీ నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని పర్వతాలు యాదవ్ విజ్ఞప్తి చేశారు.