పవన్ కల్యాణ్ హెచ్చరిక
- పవిత్ర గోవింద నామాల పేరడీపై ఆగ్రహం
- భక్తుల మనోభావాలను కించపరచడం సరికాదని స్పష్టం
అమరావతి, ఆంధ్రప్రభ: పవిత్రమైన దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, భక్తి గీతాలను రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తూ అపహాస్యం చేయడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని భక్తితో స్మరించే గోవింద నామాలను రాజకీయ కార్యక్రమాల్లో పేరడీగా ఉపయోగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్.. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలను వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. రాజకీయంగా ఎవరినైనా విమర్శించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, అందుకోసం ప్రజల ధార్మిక విశ్వాసాలకు సంబంధించిన అంశాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.
భక్తుల విశ్వాసాలను గౌరవించాలి..
దైవ నామాలు కేవలం పదాలు కాదని.. అవి కోట్లాది మంది భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావనలతో ముడిపడి ఉన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అలాంటి నామాలను పరిహాసానికి, రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం వల్ల సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందన్నారు.
మతపరమైన విద్వేషాలకు కారణమయ్యేలా వ్యవహరించే ప్రయత్నాలను ఉపేక్షించరాదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పార్టీ నాయకులకు సూచించారు.
మంత్రాలు, స్తోత్రాల విషయంలో సంయమనం అవసరం..
ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలు, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం మార్చడం లేదా పరిహాసంగా ప్రదర్శించడం వంటి ధోరణికి స్వస్తి పలకాలని పవన్ కల్యాణ్ సూచించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ.. అవి వ్యక్తిగత, రాజకీయ అంశాలకే పరిమితం కావాలని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కల్యాణ్ అన్నారు. భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ ధార్మిక భావాలను కించపరిచే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
