జాతీయ జెండాలతో హోరెత్తిన తిరంగా యాత్ర
మోటార్‌సైకిళ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ..
మండల బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ
బెజ్జంకి, ఆంధ్రప్రభ : దేశభక్తి ఉప్పొంగింది.. జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో బెజ్జంకి మండల కేంద్రం మార్మోగింది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు.
ఈ తిరంగా యాత్రలో యువకులు పెద్ద సంఖ్యలో మోటార్‌సైకిళ్లపై, రైతులు ట్రాక్టర్లపై జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో మోటార్‌సైకిళ్లు, ట్రాక్టర్లపై భారీ ర్యాలీ కొనసాగింది.
‘భారత్ మాతాకీ జై’, ‘వందే మాతరం’ నినాదాలతో బెజ్జంకి మండల కేంద్రంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి ప్రతి భారతీయుడి జీవితంలో అంతర్భాగంగా ఉండాలని అన్నారు. జాతీయ జెండా దేశ గౌరవానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు.
యువతలో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. జాతీయ జెండా పట్ల గౌరవాన్ని, దేశం పట్ల బాధ్యతను ప్రజల్లో పెంపొందించడమే తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
యువత, రైతులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనడంతో యాత్ర విజయవంతమైంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
