target2029 | జనసేన ‘పల్లె పట్టు’ వ్యూహం.. గ్రామాల్లో బలం పెంచే యత్నం

target2029 | జనసేన ‘పల్లె పట్టు’ వ్యూహం.. గ్రామాల్లో బలం పెంచే యత్నం
target2029 | స్థానిక సంస్థలపై జనసేన ఫోకస్
‘ఉద్యమి’ సభ్యత్వ కార్యక్రమం వెనుక వ్యూహం
వైసీపీపై కౌంటర్ ప్లాన్
పవన్ ఇమేజ్ ఎంతవరకు ప్లస్?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఏ రాజకీయ పార్టీ అయినా కాలపరీక్షకు నిలబడి, పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఆ పార్టీ పునాదులు పల్లెల్లో బలంగా ఉండాలి. గ్రామాల్లోని అట్టడుగు స్థాయి కార్యకర్తలే ఏ పార్టీకైనా నిజమైన అండాదండలు. వారు తోడుంటేనే అధికార పీఠం సుస్థిరమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ‘పల్లె పట్టు – పార్టీ పటిష్టం‘ అనే నినాదంతో గ్రామాల్లో పట్టు సాధించేందుకు జనసేనాని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

స్థానిక సంస్థలే లక్ష్యంగా..
2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమిగా వెళ్ళిన జనసేన, నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌తో అధికారంలో వాటా సాధించింది. అయితే, కేవలం అధినేత పాపులారిటీతోనో, పొత్తుల బలం తోనో ప్రతిసారి గెలవడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీలకు గ్రామ స్థాయి వరకు పటిష్టమైన యంత్రాంగం, కేడర్ బలం ఉంది. ఈ నేపథ్యంలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన తన సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితేనే.. అసెంబ్లీలో ఆధిపత్యం సులువవుతుందని పార్టీ భావిస్తోంది.
‘ఉద్యమి’ పేరుతో సభ్యత్వ సమరం
సినిమా గ్లామర్, యువతలో క్రేజ్ పవన్‌కు కొండంత అండ. కానీ, క్షేత్రస్థాయిలో ఓట్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లే కార్యకర్తల కొరత జనసేనలో కొంత కనిపిస్తోంది. దీనిని అధిగమించేందుకు ‘ఉద్యమి‘ పేరుతో సభ్యత్వ నమోదును జనసేన ఒక ఉద్యమంలా చేపట్టింది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో సభ్యత్వ సంఖ్యను భారీగా పెంచాలని అధినాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే గడువును పెంచుకుంటూ పోతూ, గ్రామ గ్రామాన జనసైనికులను తయారు చేస్తోంది.

వైసీపీ కోటలకు బీటలు?
సభ్యత్వ నమోదులో జనసేన అనుసరిస్తున్న మరో వ్యూహం.. ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని దెబ్బకొట్టడం. గత ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిన వైసీపీ కార్యకర్తలను, అసంతృప్తితో ఉన్న క్షేత్రస్థాయి నేతలను జనసేన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తద్వారా పల్లెల్లో వైసీపీని బలహీనపరిచి, ఆ ఖాళీని తాము భర్తీ చేయాలని చూస్తున్నారు.

మంత్రిగా పవన్ ఇమేజ్.. ప్లస్ అవుతుందా?
అదృష్టవశాత్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాలు మరియు పవన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా ‘పల్లె పట్టు‘ సాధించవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పవన్ పట్ల ఉన్న క్రేజ్‌ను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో ‘ఉద్యమి‘ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి!

