పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్

గణపురం, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం గణపురం మండలంలోని మైలారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,500 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. జిల్లాలో పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరిస్తూ, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.