సంగంబండ రిజర్వాయర్‌కు నీటి విడుదల.. రైతుల్లో ఆనందం
మక్తల్, ఆంధ్రప్రభ: ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం తెలంగాణలోకి చేరింది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇరిగేషన్ డీఈ వెంకటరమణ, మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి, కాంగ్రెస్ నాయకులు, రైతుల సమక్షంలో చిన్నగోప్లాపూర్ భీమా స్టేజ్-1 పంప్‌హౌస్‌లో ఒక పంపును ప్రారంభించి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రధాన కాలువకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
భీమా స్టేజ్-1 నుంచి విడుదలైన నీరు సోమవారం స్టేజ్-2కు చేరుకోవడంతో మరో పంపును ప్రారంభించి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అదనంగా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంప్‌హౌస్ సిబ్బంది చెన్నయ్య గౌడ్, మామిళ్ల కృష్ణ, టెక్నీషియన్లు అమీద్, శ్రీనివాస్‌రావు, ముస్కాన్, బాలు తదితరులు పాల్గొన్నారు.
