Regional Ring Road Telangana | నష్టపరిహారం పెండింగ్‌తో నిలిచిన పనులు
Regional Ring Road Telangana | నష్టపరిహారం పెండింగ్‌తో నిలిచిన పనులు
Regional Ring Road Telangana | ట్రిపుల్‌ఆర్‌లో భూసేకరణే ప్రధాన అడ్డంకి
గౌరెల్లి-వలిగొండ రహదారికి భూసేకరణ సమస్య
గిరిజన ప్రాంతాల్లో మరింత క్లిష్టంగా మారిన ప్రక్రియ
Regional Ring Road Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) విషయంలో కూడా భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారుతోంది. రేవంత్ సర్కారు ఒకే విధమైన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (ఆర్ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, భూసేకరణలో సమస్యలు, సవాళ్లు, అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు.
ప్రాంతాల వారీగా డిమాండ్‌ను బట్టి నష్టపరిహారం పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, నిర్వాసితులు వెనక్కి తగ్గడం లేదు. ట్రిపుల్ఆర్ కోసం సేకరించాల్సిన భూముల్లో ఇప్పటికే 95 శాతం భూములకు అవార్డు పాస్ చేసినప్పటికీ, నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
మిగిలిన 5 శాతం కూడా పూర్తయితే ఒకేసారి మొత్తం నష్టపరిహారాన్ని చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ చెబుతుండగా, అవార్డు పాస్ అయిన భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించి, టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా సానుకూల స్పందన కరువవుతోంది.
హైదరాబాద్-మన్నెగూడ సెక్షన్ (ఎన్‌హెచ్-163) పనులకు అగ్రిమెంట్ జరిగి మూడేళ్లు అవుతున్నా, పనుల పురోగతి మాత్రం ముందుకు కదలడం లేదు. 46 కి.మీ. పొడవైన ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల్లో ఇప్పటికే 92 శాతం సేకరణ పూర్తయింది. మిగిలిన 8 శాతం భూసేకరణ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, మొత్తం రోడ్డు నిర్మాణ పనులను పెండింగ్‌లో పెట్టడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరెల్లి-వలిగొండ (ఎన్‌హెచ్-930పీ) రహదారి నిర్మాణంలోనూ భూసేకరణ సమస్యగా మారింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-భద్రాచలం మధ్య ప్రయాణ దూరం దాదాపు 150 కి.మీ. తగ్గుతుంది. కానీ, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవుతుందన్న నమ్మకం కలగడం లేదు. గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ మరింత సమస్యాత్మకంగా మారుతోంది.
వలిగొండ నుంచి తురుము వరకు భూసేకరణతో పాటు టెండర్లు పూర్తయి పనులు కొనసాగుతున్నాయి. తొర్రూరు వయా నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ల్యాండ్ ఆక్విజిషన్ కోసం సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిపురం గ్రామం, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ పక్క నుంచి ఇల్లెందు రోడ్డుకు నేషనల్ హైవేను అనుసంధానిస్తున్నారు.
