ఇంద్రకీలాద్రిపై ఎర్ర సముద్రం
- భవానీల సందోహం
- క్యూలైన్లన్నీ కిటకిట
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada) లోని ఏ రహదారి చూసిన… ఏ ప్రాంతంలో చూసిన… ఏ విధి లో ఎక్కడ చూసినా తరలివస్తున్న భవానీల రాక సందడి ఎక్కువగా కనిపిస్తోంది. అత్యంత పవిత్రమైన అమ్మవారి దీక్షను తీసుకున్న భవాని భక్తులు కనకదుర్గమ్మను కనులారా వీక్షించేందుకు ఊహించని విధంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. మదినిండా అమ్మ నామస్మరణను జపిస్తూ, అమ్మవారి పాటలను స్మరిస్తూ వేల సంఖ్యలో తరలివస్తున్న భవానీల రాకతో అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఇంద్రకీలాద్రి అరుణ శోభితంగా కనిపిస్తోంది.

దసరా ఉత్సవాలు (Dussehra celebrations) ముగింపు తర్వాత రెండవ రోజు శనివారం ఇంద్రకీలాద్రికి భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. గంట గంటకు భవానీల రాక మరింత పెరగడంతో అన్ని ప్రాంతాల్లో హోల్డింగ్ ఏరియాలలో ఎక్కడ చూసినా భవాని లేఖనిపిస్తున్నారు. పవిత్ర కృష్ణానది తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భవానీలు అమ్మవారికి తలనీలాలను భక్తిశ్రద్ధలతో సమర్పించి అమ్మ దర్శనం కోసం హోల్డింగ్ ఏరియాలలో ఎదురుచూస్తున్నారు.

రద్దీ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో భవానీలను నియంత్రిస్తూ కొంత కొంత మంది గా పోలీసులు భవానీలను క్యూ లైన్ లోకి వదులుతున్నారు. అయితే గేటు తీయగానే పరిగెత్తుకుంటూ దూసుకు వస్తున్న భవానీలను నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లేందుకు ప్రధాన రహదారులైన కుమ్మరిపాలెం జంక్షన్ (Kummaripalem Junction) తో పాటు వినాయకుడి గుడి వద్ద వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వరుస సెలవులు కావడంతో జగన్మాతను దర్శించుకుని మాల విసర్జన కోసం రాష్ట్రం నలుమూలల నుండి భవానీలు పెద్ద ఎత్తున విజయవాడకు తరలివస్తున్నారు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి నుండి భవాని భక్తులు కాలినడకన జై భవాని జై జై దుర్గ భవాని నామస్మరణను జపిస్తూ వస్తున్నారు.

24 గంటలు అన్న ప్రసాదం…
రోజురోజుకీ భవానీల రాక పెరుగుతుండడంతో వారికోసం దేవస్థానం అధికారులు (Temple authorities) ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్లో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు వచ్చిన భక్తుల అందరికీ 24 గంటల పాటు అన్నప్రసాదం అందించేలా ఈవో శీనా నాయక్ ఆదేశాల నేపథ్యంలో అధికారుల సైతం చర్యలు చేపట్టారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు పూటలా భవాని భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, భవానీలు కోరినన్ని లడ్డూలు అందించే విధంగా ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. క్యూలైన్లలో భవానీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మంచినీరు మజ్జిగ ప్యాకెట్లను సైతం అందిస్తున్న అధికారులు పాలను కూడా ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేశారు. శనివారం కనకదుర్గమ్మ దర్శనానికి మూడు గంటల పైగా సమయం పడుతున్నప్పటికీ భక్తులు అమ్మనామస్మరణ జపిస్తూ ఓపికగా క్యూలైన్లలో అమ్మ దర్శనానికి ఎదురుచూస్తున్నారు.

