sports | డచ్‌లపై దండయాత్ర
sports | డచ్‌లపై దండయాత్ర
హర్మన్‌ప్రీత్ సేన రెడీ!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ
మ్యాచ్ సమయం: రాత్రి 7 గంటలు
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, డిస్నీ+ హాట్‌స్టార్ యాప్
sports | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్-1లో భాగంగా బుధవారం లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్(డచ్)తో భారత్ తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి శుభారంభం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన, అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పాకిస్థాన్‌పై విజయం సాధించినప్పటికీ భారత జట్టు ప్రదర్శనలో కొన్ని లోపాలు కనిపించాయి. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఓపెనర్ స్మృతి మంధాన అర్ధశతకంతో మెరిసగా, వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భార్తీ ఫుల్మాలి వంటి కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యతాయుతంగా ఆడినా దూకుడు ప్రదర్శించలేకపోయింది.
ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌పై బ్యాటర్లు భారీ స్కోరు నమోదు చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ముఖ్యంగా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ ఫామ్‌పై కొంత ఆందోళన నెలకొంది. మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, భార్తీ ఫుల్మాలి నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. రిచా ఘోష్, దీప్తి శర్మల నుంచి కూడా జట్టు పెద్ద అంచనాలే పెట్టుకుంది.
అయితే బౌలింగ్ విభాగం భారత్‌కు పెద్ద బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అదే జోరును కొనసాగిస్తూ నెదర్లాండ్స్‌పై కూడా ఆధిపత్యం చెలాయించాలని భారత్ భావిస్తోంది.
ముందున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని, ఈ పోరులో అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇరు జట్లు తొలిసారి ముఖాముఖి తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
ఇతర మ్యాచ్‌లు:
ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – మధ్యాహ్నం 3 గంటలు
పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా – రాత్రి 11 గంటలు
