Andhra Pradesh railway projects | కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు వేగంగా చర్యలు

Andhra Pradesh railway projects | కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు వేగంగా చర్యలు
Andhra Pradesh railway projects | హైదరాబాద్-చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో పెరుగుతున్న రైళ్ల రద్దీకి అదనపు లైన్లు
బాపట్ల-రేపల్లె రైల్వే లైన్ సర్వే ముమ్మరం
అమరావతి, విశాఖ మార్గాల్లో భారీ రైల్వే విస్తరణ ప్రణాళికలు
Andhra Pradesh railway projects | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 11 ప్రాంతాల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన భూ సర్వే, డీపీఆర్లు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల హైస్పీడ్ రైళ్లు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. మచిలీపట్నం-నరసాపురం, ఒంగోలు-దొనకొండతో సహా 11 ప్రాంతాల్లో కొత్త లైన్లు వేయనున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైలకు హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 1,960 కి.మీ మేర 26 ప్రాజెక్టులకు డీపీఆర్లు రూపొందిస్తున్నారు. అంతేకాదు రైళ్ల రద్దీని తగ్గించేందుకు పలు మార్గాల్లో అదనపు లైన్లు నిర్మిస్తున్నారు. కొంతకాలంగా పలు లైన్లలో ఎక్కువగా రైళ్లు నడపాలని డిమాండ్ ఉంది. దీంతో రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మచిలీపట్నం నుంచి నరసాపురం, మచిలీపట్నం నుంచి రేపల్లె, ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక)లు సిద్ధమవుతున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వయా ఏపీ మీదుగా, హైదరాబాద్ నుంచి చెన్నైకు ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్లు నడిపేలా హైస్పీడ్ కారిడార్లకు సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు మార్గాల్లో రైళ్ల రద్దీ మరింత పెరిగింది. దీంతో రైల్వే లైన్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడెక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందో గుర్తించి అధికారులు కేంద్ర రైల్వే శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. అందుకు ఆయా రూట్లలో అవసరమైన చోట మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్లు కూడా నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఆ డీపీఆర్లు కూడా తయారు చేస్తున్నారు.
రైల్వే శాఖ రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 1,960 కి.మీ మేర కొత్త మార్గాల్లో పనులకు సిద్ధమవుతోంది. రైలు మార్గం లేని 11 ప్రాంతాల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని చూస్తోంది. గతంలో సర్వే చేసిన 11 మార్గాల్లో రైలు మార్గాలు ఇప్పటివరకు లేవని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అందుకే కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టారు. అయితే వీటికి గతంలోనే సర్వేలు చేయగా, రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో డీపీఆర్లు తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైలు పట్టాల కోసం బైపాస్ లైన్లు వేస్తారు. అలాగే రైలు మార్గంపై కొన్నిచోట్ల అధునాతన వంతెనలు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లు నడపటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్లో ఏపీలో 300 కి.మీ, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్లో ఏపీలోని 464 కి.మీకు డీపీఆర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం మార్గాల్లో ముందెన్నడూ లేని విధంగా సరకు రవాణా రైళ్లు బాగా పెరిగాయి. అందుకే ఈ మార్గాల్లో మూడు, నాలుగు లైన్లు వేస్తున్నారు.
విశాఖపట్నంలోని సింహాచలం నార్త్ నుంచి కొత్తవలస వరకు ఐదు, ఆరో లైన్ల నిర్మాణం కోసం డీపీఆర్లు తయారు చేస్తున్నారు. విజయవాడ-చెన్నై, విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం మార్గాల్లో సరకు రవాణా రైళ్ల రాకపోకలు గతం కంటే బాగా పెరిగాయి. దీనితో రైల్వే శాఖ ఈ మార్గాల్లో అదనపు లైన్లు వేయడానికి చూస్తోంది. కొన్ని చోట్ల మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది. ఒడిశా నుంచి ఖనిజాలు వస్తుండటంతో కొత్తవలస వరకు ఐదు, ఆరో లైన్లు వేయడానికి డీపీఆర్లు రెడీ చేస్తున్నారు.
మొత్తం మీద రాష్ట్రంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొన్ని రైల్వే లైన్లకు కూడా లైన్ క్లియర్ అయ్యింది. కొత్త రైల్వే లైన్ల వివరాలు ఇలా ఉన్నాయి: ఒంగోలు-దొనకొండ కొత్త లైన్, దూపాడు-బేతంచర్ల, మచిలీపట్నం-నరసాపురం, మచిలీపట్నం-రేపల్లె, బాపట్ల-రేపల్లె కొత్త లైన్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. పాలసముద్రం-నారాయణపురం, కాచిగూడ-చిట్యాల-జగ్గయ్యపేట, కొండపల్లి-సత్తుపల్లి, కొత్తగూడెం-కిరండోల్ మార్గాల్లో కూడా కొత్త లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
కొత్తవలస-అనకాపల్లి మధ్య, గుంతకల్లు దగ్గర బైపాస్ లైన్, రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) వంతెన, పేరేచర్ల-మంగళగిరి మధ్య బైపాస్ లైన్, ఆర్వోఆర్ వంతెనలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. భవిష్యత్తులో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని లైన్లు, కారిడార్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
బాపట్ల-రేపల్లె రైల్వే లైన్ సర్వే పనులు ముమ్మరం
బాపట్ల-రేపల్లె రైల్వే లైన్ భూమి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డీపీఆర్లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అసలైన నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మార్గం పొడవు 45 నుంచి 47 కిలోమీటర్ల వరకు ఉంది. రైల్వే బోర్డు ఆమోదించటంతో తుది లొకేషన్ సర్వే పనులు కొనసాగుతున్నాయి. బాపట్ల నుంచి రేపల్లె, నిజాంపట్నం పోర్ట్ గుండా ఈ లైన్ అనుసంధానం అవుతుంది. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
