పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
- ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : బోథ్ నియోజకవర్గంలోని బోథ్, బజార్‌హత్నూర్, ఇచ్చోడ మండలాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు.
ఇచ్చోడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ.88.55 లక్షల వ్యయంతో, బోథ్‌లో రూ.38.15 లక్షలతో, బజార్‌హత్నూర్‌లో రూ.42.12 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు, పాఠశాలల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
