రూ.237 కోట్లతో సింగారం–మక్తల్ నాలుగు లైన్ల రహదారి పనులు వేగవంతం
22 కిలోమీటర్ల బైక్ ర్యాలీ ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి..
ఊట్కూర్ (ఆంధ్రప్రభ): నారాయణపేట జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సింగారం చౌరస్తా నుంచి మక్తల్ వరకు రూ.237 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, యువజన, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఊట్కూర్ మండలంలోని తిప్రాస్‌పల్లి గ్రామ శరభలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి తిప్రాస్‌పల్లి నుంచి ఊట్కూర్ మీదుగా మక్తల్ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర నిర్వహించిన బైక్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మక్తల్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సింగారం–మక్తల్ నాలుగు లైన్ల రహదారి పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలకు ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, నారాయణపేట జిల్లాకు అవసరమైన నిధులు తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, మంత్రి పర్యటన సందర్భంగా ఊట్కూర్ మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
