నూతన రేషన్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ప్రతి అర్హ కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తామని వెల్లడి

భూపాలపల్లి (ఆంధ్రప్రభ): ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికీ చేరేలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మండలంలోని మొరంచపల్లి గ్రామంలో సోమవారం ఆర్డీవో హరికృష్ణతో కలిసి నూతన రేషన్ దుకాణం (షాప్ నెం.14)ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ అధిక వ్యయంతో కూడుకున్నదని చెబుతూ పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నాణ్యతలేని బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో మొరంచపల్లి సర్పంచ్ నరెడ్ల తిరుపతి రెడ్డి, శ్యాంనగర్ సర్పంచ్ ఒరుగంటి రజిత–బాబూరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చాడ రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నూకల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రాజమౌలి, రేషన్ డీలర్ చుక్క కవిత, ఆర్‌ఐ రామస్వామి, జీపీఓ కృష్ణమూర్తితో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.