ఎన్‌ఎఫ్‌డీబీ నిధులతో మత్స్యకార సంఘం కార్యాలయ ఆధునికీకరణ
రూ.90 వేలతో ఫర్నిచర్, కంప్యూటర్ ఏర్పాటు..
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంఘం సభ్యులు
భీమ్‌గల్ రూరల్ (ఆంధ్రప్రభ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) పథకం ద్వారా మెండోరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నిధులు మంజూరుకావడంపై సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం కార్యాలయ ఆధునికీకరణ కోసం మంజూరైన రూ.90 వేల నిధులు నేరుగా సంఘం బ్యాంకు ఖాతాలో జమ కావడంతో సోమవారం నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్‌తో పాటు సభ్యుల వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
నూతన సామగ్రిని భారతీయ జనతా పార్టీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరె రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెండోరాతో పాటు భీమ్‌గల్ మండలంలోని మరో ఏడు మత్స్యకార సహకార సంఘాలకు కూడా రూ.90 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపల పెంపకం, వ్యాపార విస్తరణకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సబ్సిడీ ఆధారిత రుణాలు అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రవాణా పథకాలూ అమలవుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెండోరా సంఘం అధ్యక్షుడు ముస్లి ఎర్రన్న, ఉపాధ్యక్షుడు కల్లెడ రవికుమార్, కార్యదర్శి గజనవేణి మోహన్, డైరెక్టర్లు, సంఘం సభ్యులు, బీజేపీ జిల్లా నాయకులు నాగార్జున్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు తక్కురి అంజయ్య, బూత్ అధ్యక్షుడు వాల్గోట్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
