Supreme Court | విచారణ చేపట్టడం కుదరదు.. తెలంగాణకు తేల్చిచెప్పిన సుప్రీం

Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు, నీటి వినియోగం, బనకచర్ల అంశాలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని, అలాగే మధ్యంతర ఉత్తర్వులు (ఇంజంక్షన్) ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.

పిటిషన్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొన్న జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం, అవి సరిదిద్దే వరకు కేసును విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది, ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు.

అయితే, పిటిషన్‌లోని లోపాలను సరిచేసిన తర్వాతే మిగతా అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌లోని లోపాలు సవరించకుండా విచారణ చేపట్టలేమని, అలాంటి పరిస్థితుల్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం కూడా సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.