Citizenship | స్పెల్లింగ్ తప్పుల ఆధారంగా విదేశీయులుగా ప్రకటించొద్దు..

Citizenship | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అస్సాంలో పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశీయులుగా ప్రకటించబడిన వ్యక్తులకు రక్షణ కల్పించే దిశగా పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియలో కేవలం సాంకేతిక కారణాలను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా గతంలో గౌహతి హైకోర్టు పరిధిలోని విదేశీయుల ట్రిబ్యునళ్లు ఇచ్చిన కొన్ని తీర్పులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. పాత ఓటర్ల జాబితాల్లో తమ పేర్ల స్పెల్లింగ్‌లో ఉన్న అక్షర దోషాలు, చిన్నపాటి వ్యత్యాసాలను కారణంగా చూపి తమను విదేశీయులుగా ప్రకటించారని ఆరోపిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల వాదనలు పరిశీలించిన ధర్మాసనం, పేర్లలో స్వల్ప స్పెల్లింగ్ తేడాలు లేదా అక్షర దోషాలను మాత్రమే ఆధారంగా తీసుకుని ఒకరి పౌరసత్వాన్ని అనుమానించడం సరికాదని పేర్కొంది. పౌరసత్వ నిర్ధారణలో పూర్తి ఆధారాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన విధానాన్ని అనుసరించాలని సంబంధిత అధికారులకు సూచించింది.