ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు అండగా సర్పంచ్
భీమ్‌గల్ రూరల్ (ఆంధ్రప్రభ): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) తెలిపారు. ఎస్ఐఆర్ ఫారాలను నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గ్రామ యువకుల సహకారంతో సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన లేని వారికి ప్రత్యేక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఎవరి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తదితర అవసరమైన పత్రాలతో వచ్చి ఫారాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినయ్, ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, ఐకేపీ వీవోఏలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
