నాణ్యమైన రేషన్ బియ్యం ప్రతి లబ్ధిదారునికి

  • పంపిణీలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకత
  • రేషన్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు
  • తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు

విస్సన్నపేట , ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన రేషన్ బియ్యం సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ కౌంటర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవనాధారమని, ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం ప్రతి అర్హ లబ్ధిదారునికి పారదర్శకంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పంపిణీలో ఎలాంటి అవకతవకలు, ఆలస్యం లేదా నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రేషన్ పంపిణీ కేంద్రాల్లో తూకం, నాణ్యత, నిల్వ, సరఫరా ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించి, పంపిణీ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఇతర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

అనంతరం రేషన్ బియ్యం నాణ్యత, నిల్వ విధానం, పంపిణీ ప్రక్రియను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్వో, పౌర సరఫరాల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, మహిళలు, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.