లాఠీకి బదులుగా పొరక పట్టిన పోలీసులు

లాఠీకి బదులుగా పొరక పట్టిన పోలీసులు
జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో స్వచ్ఛ కార్యక్రమం..
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు లాఠీలకు బదులుగా పొరకలు, పారలు పట్టి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు భద్రత కల్పించే బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలనే ఉద్దేశంతో పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల ఆవరణల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ముఖ్యంగా డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. అలాగే స్టేషన్ ప్రాంగణాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు. పరిశుభ్రతతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ పలు చోట్ల మొక్కలు నాటారు.
సాధారణంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉండే పోలీసులు, ఈసారి స్వచ్ఛత కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. పోలీసులు చేతిలో లాఠీలకు బదులుగా పలకలు, పారలు కనిపించడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. సమాజంలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంలో పోలీసుల పాత్ర కూడా కీలకమని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వీధులు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యమైన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా పాల్గొని పరిశుభ్రత పట్ల తమ నిబద్ధతను చాటిచెప్పారు. ప్రజలతో మమేకమవుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే పోలీస్ శాఖ చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జిల్లాలో చేపట్టిన ఈ స్వచ్ఛత కార్యక్రమాలు ప్రజల్లో కూడా మంచి స్పందనను కలిగించాయి.
