Rs.6,309cr | అన్నదాతల బతుకులు మారాలి..

Rs.6,309cr | అన్నదాతల బతుకులు మారాలి..
శాసనసభ్యుడు కన్నా.
Rs.6,309cr | సత్తెనపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి మండలం లోని కట్టావారిపాలెం గ్రామం నందు అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచార కార్యక్రమం లో శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనము,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ వ్యవసాయం లాభ సాటి కావాలి, అన్నదాతల బతుకులు మారాలి అన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని, దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా, సుభిక్షంగా ఉంటామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. సాగుకి అవసరమైన అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం. ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ నిధులను విడతలు వారిగా ఇస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో సుమారు రూ.6,309 కోట్లు జమా చేశాం. ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ నిధులతో కలిపి ప్రతీ రైతు అకౌంట్ లో రూ.6 వేలు వేస్తున్నాం.
అన్నదాత సుఖీభవ పథకం రైతు జీవితానికి నమ్మకంగా నిలిచింది. వారికి వ్యవసాయంలో పెట్టుబడికి సాయంగా నిలుస్తోందన్నారు.పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6వేలు అందిస్తుంటే.. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రూ.14వేలు కలిపి మొత్తం ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామన్నారు.రైతులకు సరిపడ ఎరువులను సబ్సిడీ ధరలపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇస్తున్నాం.
కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఎరువులు కొరత లేకుండా చేస్తున్నాం.రాయితీలపై వ్యవసాయ పరికరాలు ఇచ్చి.. సాగు రంగంలో సాంకేతిక జోడిస్తున్నామని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కల్లంలో ధాన్యం అమ్మగానే 24 గంటల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబులు జమా చేసున్నామని అన్నారు. జగన్ రెడ్డి హయాంలో రైతు మోసపోయాడని,అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అబద్ధాలను పాలనగా మార్చిన జగన్ రెడ్డి, రైతు సంక్షేమాన్ని తన ప్రచార కార్యక్రమాల్లో ఓ భాగంగా మార్చేశాడని విమర్శించారు.
ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారు. రైతు రుణమాఫీ రద్దు చేసి అన్నదాతలకు ద్రోహం చేశాడన్నారు.ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలతో పోల్చిన జగన్, వాటిలోని ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయినా 99% నెరవేర్చినట్టు చెప్పడం దారుణమైన మోసం అని పేర్కొన్నారు.రైతు భరోసా కేంద్రాల పేరుతో కట్టించిన భవనాలు పనికి రాకుండా నిలిచి పోయాయి.
వాటికే కూటమి ప్రభుత్వం ప్రాణం పోసి, నూతనంగా రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ నిజమైన సేవా మార్గాన్ని ఎంచుకుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు, సత్తెనపల్లి ఏడీఏ బి.రవికుమార్, ఏఓ బి.సుబ్బారెడ్డి, వివిధ హోదాల్లో వున్న ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర, జిల్లా ,నియోజకవర్గ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
