ఎస్ఐఆర్ ఫారాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలి: పటేల్ వంశిరెడ్డి
ఆలేరు, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందిస్తున్న ఎస్ఐఆర్ ఫారాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ వంశిరెడ్డి మంగళవారం అధికారులను కోరారు.
2002 నాటి ఓటరు జాబితాలో పేరు ఉన్న వారికి ఎస్ఐఆర్ ఫారం అందజేసే సమయంలో అవసరమైన వివరాలను పూర్తిగా తెలియజేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఫారాలు సక్రమంగా నింపితే, వారి పిల్లల వివరాలను నమోదు చేయడం కూడా సులభమవుతుందని తెలిపారు.
ఇప్పటికీ చాలా మంది ప్రజలు కనీసం ఎస్ఐఆర్ ఫారాలను కూడా తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంటి నంబర్ ఉన్న కుటుంబ సభ్యుల ఓటర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లకు మారిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియలో వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఓటరు కార్డు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకేలా లేకపోవడంతో వాటిని సరిచేసుకునేందుకు ప్రజలు ఆన్లైన్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఎస్ఐఆర్ ఫారాలు ప్రతి అర్హుడికి అందేలా చూడటంతో పాటు, వాటిని సక్రమంగా నింపేందుకు సంబంధిత సిబ్బంది సహాయం చేయాలని అధికారులను కోరారు. అవగాహన లేక ఫారాలు తప్పుగా నింపడంతో అవి తిరస్కరణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
2002 నాటి ఓటరు నమోదును గుర్తించేందుకు పాత ఇంటి నంబర్ల వివరాలను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు తక్కువగా ఉన్నందున అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పటేల్ వంశిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
