సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలి

  • మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

నల్గొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 28న కనగల్ మండల కేంద్రంలో సుమారు రూ.13 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, అనంతరం నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం సభ విజయవంతం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై చర్చించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీలేని రుణాలు సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే సీఎం సభ చారిత్రాత్మకంగా నిలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. బూత్ స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని అన్నారు.

ఈ నెల 28న జరిగే బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గం నుంచి 60 వేల మందికి పైగా ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కనగల్ వద్ద ఆర్‌అండ్‌బీ రహదారి పనులకు శంకుస్థాపనతో పాటు, మెడికల్ కళాశాల నుంచి దుప్పలపల్లి వరకు రూ.250 కోట్లతో నిర్మించే రహదారికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే నియోజకవర్గంలో రూ.430 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాలువ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం సభలో నల్గొండకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని, సభ విజయవంతానికి పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు ఆలకుంట నాగరత్నం రాజు, పాశం సంపత్‌రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.