Rao Bahadur Movie | ‘ప్రతి సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన చిత్రం’.. సందీప్ రెడ్డి వంగా

Rao Bahadur Movie | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విభిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుంది. విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదల అనంతరం మిశ్రమ స్పందనను అందుకుంటున్నప్పటికీ.. సినీ ప్రముఖుల నుంచి మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్ మహా–సత్యదేవ్ కాంబినేషన్‌పై ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథ, పాత్రల రూపకల్పనలో తనదైన శైలిని కొనసాగించిన వెంకటేశ్ మహా మరోసారి వైవిధ్యమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇక ఈ సినిమాను వీక్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘రావు బహదూర్’ ఒక అరుదైన సినిమా. మనం సినిమాను ఎందుకు ప్రేమిస్తామో గుర్తు చేసే చిత్రాల్లో ఇది ఒకటి. ప్రతి సినిమా ప్రేమికుడు తన జీవితంలో మూడు గంటల సమయాన్ని ఈ చిత్రానికి కేటాయించాలి. మీ సమయం, మీ శ్రద్ధ, మీ చప్పట్లకు ఈ సినిమా పూర్తిగా అర్హమైనది అంటూ ప్రశంసించారు. సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకుడు ఇంతగా మెచ్చుకోవడంతో ‘రావు బహదూర్’పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మిశ్రమ టాక్ మధ్య ప్రముఖుల నుంచి వస్తున్న ప్రశంసలు ఈ సినిమాకు అదనపు బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.