కమిటీల పేరిట కాలయాపన.. కాలుష్యం కోరల్లో ‘అంతమ్మగూడెం ’!

కమిటీల పేరిట కాలయాపన.. కాలుష్యం కోరల్లో ‘అంతమ్మగూడెం ’!
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించినా కదలని అధికారులు
- 15 రోజులు దాటినా రంగంలోకి దిగని 12 మంది సభ్యుల కమిటీ !
- భూగర్భంలోకి రసాయన వ్యర్థాలు.. గాల్లోకి విషవాయువులు
- పరిశ్రమలకు ‘క్లీన్ చిట్’ ఇచ్చేందుకే తనిఖీల్లో జాప్యమా?
- మండిపడుతున్న కాలుష్యం బాధితులు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులు, రసాయన వ్యర్థాలతో స్థానిక గ్రామాలు నరకప్రాయంగా మారుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా యంత్రాంగం మాత్రం ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ కాలుష్య కారక పరిశ్రమలకే అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ అంతమ్మగూడెం గ్రామ ప్రజలు, ‘అత్తమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి’ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘తనిఖీల్లో తేలినా చర్యలేవి’ ?

హజేలో లేబరేటరీ పరిశ్రమ విపరీతమైన కాలుష్యానికి పాల్పడుతున్నట్లు జూన్ 2025 లోనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించి మరీ నిర్ధారించారు. అంతేకాకుండా, జిల్లా పిసిబి అధికారులు తనిఖీలు చేసిన ప్రతిసారీ పరిశ్రమ నుండి విపరీతంగా వ్యర్థ వాయువుల వాసనలు వస్తున్నట్లు నివేదికలు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా, సదరు పరిశ్రమకు కేవలం నోటీసులు జారీ చేయడం, బ్యాంక్ గ్యారంటీలు జప్తు చేయడం వంటి నామమాత్రపు చర్యలతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అనుమతులు లేని ఉత్పత్తులను తయారు చేస్తూ కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు, లక్షల రూపాయల జరిమానాలు చెల్లించడానికి కూడా వెనుకాడడం లేదు.
‘15 రోజుల గడువు ముగిసినా మొదలవ్వని కమిటీ పని’ !

కాలుష్యంపై వస్తున్న వరుస కథనాలు, ఫిర్యాదుల నేపథ్యంలో, ఈ నెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ అధ్యక్షతన 12 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 15 రోజుల్లోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించినప్పటికీ గడువు ముగిసినా అధికారులు ఇప్పటివరకు కనీసం పని కూడా ప్రారంభించకపోవడం గమనార్హం. పరిశ్రమలు తమ ఉల్లంఘనలను పూర్తిస్థాయిలో కప్పిపుచ్చుకునేలా సమయం ఇచ్చి, ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి వారికి ‘క్లీన్ చిట్’ ఇచ్చేందుకే అధికారులు ఈ వాయిదా పర్వానికి తెరలేపారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
‘రెండు పరిశ్రమలు వదిలిన 104 ట్యాంకర్ల కెమికల్స్’ ఏమయ్యాయి ?
గ్రామ సమీపంలో ఉన్న ‘కెమిక్ లైఫ్ సైన్స్’ పరిశ్రమ యాజమాన్యం ఏకంగా 38 ట్యాంకర్ల రసాయన వ్యర్థాలను, కొయ్యలగూడెం గ్రామ సమీపంలోని వైఎం డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యం 66 ట్యాంకర్ల రసాయన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో వదిలివేసినట్లుగా నివేదికలలో పేర్కొని రెండేళ్లు గడుస్తోంది. ఆ ప్రమాదకర రసాయన వ్యర్థాలను ఎక్కడ పడేశారనే విషయాన్ని గుర్తించడానికి పిసిబి అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిన ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు సైతం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒకవైపు భూగర్భంలోకి రసాయన వ్యర్థాలను వదులుతున్నా, మరోవైపు గాల్లోకి విషవాయువులు వదులుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
‘పరిశ్రమలను తరలించాల్సిందే’:
పోరాట సమితి డిమాండ్

పర్యావరణాన్ని కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం ఫిర్యాదుదారులకు కనీసం అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కమిటీల పేరుతో డ్రామాలు ఆపాలని, కాలుష్యానికి పాల్పడుతున్న పరిశ్రమలను వెంటనే మూసివేసి ఇక్కడి నుంచి తరలించాలని, తమ ఆరోగ్యాలను, భూగర్భ జలాలను, పంటలను, పీల్చే గాలిని, తాగే నీటిని కాపాడాలని కాలుష్యం బాధితులు, కాలుష్య విముక్తి పోరాట సమితి ప్రతినిధులు గుమ్మి దామోదర్ రెడ్డి, గుమ్మి నరేందర్ రెడ్డి, రావుల రాంరెడ్డి, వస్పరి లింగయ్య, నర్సిరెడ్డి, బాల్ రెడ్డి, చిన్నప్ప, శ్రీశైలం, మహేష్, రమేష్, లింగయ్య, ప్రభ, పూజిత, ధనలక్ష్మి, లావణ్య, సుగుణమ్మ, పద్మ, శివమ్మ, భారతమ్మ, జయమ్మ, బుచ్చమ్మ, శారదమ్మ, మల్లమ్మ, సత్తమ్మ, లక్ష్మమ్మ, కలమ్మ, పద్మ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
