మచిలీపట్నంలో క్లీన్ స్వీప్ ప్రారంభం…

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: పచ్చదనం, పరిశుభ్రత ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో ముఖ్యమని మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు తెలిపారు.

నగర కార్పొరేషన్ 45వ డివిజన్‌లో మంగళవారం ఆయన డివిజన్ సచివాలయ సిబ్బంది, స్వచ్ఛ సైనికులతో కలిసి “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫైర్ స్టేషన్ పక్క రోడ్డునుంచి ఈడేపల్లి బైపాస్ రోడ్డుకు కలిసే ప్రధాన రహదారి వద్ద డ్రైనేజీ పక్కన ఉన్న చెత్తను తొలగించారు. అలాగే రోడ్డు ఊడ్చి, మేజర్ డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు.

ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ జూన్ 20 వరకు ప్రతిరోజూ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని, నగరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదని ఆయన పేర్కొన్నారు. డ్రైనేజీలలో ఆహార వ్యర్థాలు, కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల నీటి పారుదల అడ్డంకులు ఏర్పడి దుర్వాసన, దోమల సమస్యలు పెరుగుతాయని తెలిపారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కమిషనర్ చెప్పారు. ప్రతి పౌరుడు చెట్లు నాటి, పరిసరాలను శుభ్రంగా ఉంచడం బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.వి. ఫణి కుమార్, స్వచ్ఛ సైనికులు, డివిజన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply