Problems | చర్చల ద్వారానే పరిష్కారం

Problems | చర్చల ద్వారానే పరిష్కారం
Problems | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు విధుల్లో చేరాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ మనందరి కుటుంబమని, కార్మికులు సోదరులంటూ భావోద్వేగంగా పిలుపునిచ్చారు.
సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని, ప్రభుత్వం చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించాలని చూస్తోందని మంత్రి తెలిపారు. కార్మికుల సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశామని, నాలుగు వారాల్లో నివేదిక అందుబాటులోకి వస్తుందని చెప్పారు. విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి అంశాలు సాంకేతికంగా పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు.
ఈ రెండు కీలక అంశాల్లో కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేశామని, ఇది కాలయాపన కాదని స్పష్టం చేశారు.ప్రభుత్వంలో విలీనం కాకపోయినా ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు అందుతున్నాయని, గతంలో పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలు, బకాయిలను క్లియర్ చేసినట్లు తెలిపారు.
పీఎఫ్, సీసీఎస్ బకాయిలను గణనీయంగా తగ్గించి చెల్లింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు.ఉద్యోగ భారం తగ్గించేందుకు భారీగా కొత్త నియామకాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. పేదలు, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని, సమ్మె వల్ల వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు లక్షలాది మంది విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్టీసీ సేవలను వినియోగిస్తున్నారని గుర్తుచేశారు.
సమ్మె వల్ల సంస్థకు నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధుల్లో చేరాలని కోరారు. గత అనుభవాలను గుర్తుచేస్తూ, చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. హడావుడిగా తీసుకునే నిర్ణయాలు చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.
