ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో తెలుగమ్మాయి..
- టీమిండియా నుంచి ఏకైక ప్లేయర్..
ఆంధ్రప్రభ : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన అధికారిక ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ (ఉత్తమ జట్టు) లో భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తెలుగమ్మాయి శ్రీ చరణి చోటు దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక జట్టులో చోటు సంపాదించిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించింది.
టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్.. ఐదే మ్యాచుల్లో 14 వికెట్లు!
ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ.. శ్రీ చరణి తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆమె.. ఏకంగా 14 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే ‘లీడింగ్ వికెట్ టేకర్’ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) గా నిలిచింది.
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం రెండు వికెట్లు తీసిన చరణి, నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో 4/19 అత్యుత్తమ గణాంకాలతో భారత్‌కు విజయాన్ని అందించింది.

ఆస్ట్రేలియా హవా.. మోలినాక్స్ కెప్టెన్
రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు నుంచి నలుగురు ప్లేయర్లు ఈ వరల్డ్ XI జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆసీస్ కెప్టెన్ సోఫీ మోలినాక్స్… టీమ్ ఆఫ్ ది టోర్నీకి కెప్టెన్ అయ్యింది. అలాగే బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎల్లీస్ పెర్రీ, యాష్లే గార్డనర్‌లు చోటు సంపాదించారు. రన్నరప్ ఇంగ్లాండ్ జట్టు నుండి టాప్ స్కోరర్ డానీ వ్యాట్-హాడ్జ్ (302 పరుగులు), కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ ఎంపికయ్యారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ జట్టు:
డానీ వ్యాట్-హాడ్జ్ (ఇంగ్లాండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా, వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్ (ఇంగ్లాండ్), ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఐర్లాండ్), నీలాక్షిక డి సిల్వా (శ్రీలంక), మరిజానే కాప్ (సౌతాఫ్రికా), యాష్లే గార్డనర్ (ఆస్ట్రేలియా), ఫాతిమా సనా (పాకిస్తాన్), సోఫీ మోలినాక్స్ (ఆస్ట్రేలియా, కెప్టెన్), శ్రీ చరణి (భారత్). 12వ ప్లేయర్: డార్సీ కార్టర్ (స్కాట్లాండ్).
భారత జట్టు త్వరగానే నిష్క్రమించినా, ప్రపంచ మేటి ఆటగాళ్లతో కూడిన ఐసీసీ జట్టులో మన తెలుగు స్పిన్ సంచలనం శ్రీ చరణి చోటు దక్కించుకోవడం పట్ల తెలుగు క్రీడాభిమానులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
