దసరా మహోత్సవాలకు సన్నద్ధం కావాలి…
భక్తులకు ఇబ్బంది ఉండకూడదు
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
రాష్ట్ర ప్రతిష్ఠకు తగ్గట్టుగా దసరా ఉత్సవాలు నిర్వహించాలని దిశానిర్దేశం.
కనకదుర్గమ్మ దర్శనం ప్రత్యేక పూజలు.
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం కల్పించిన అధికారులు వేదపండితుల ఆశీర్వచనాలతో ప్రసాదాలు అందజేశారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
దర్శనం అనంతరం మంత్రి ఆనం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపడుతున్న కాలిబాటలు, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపడుతున్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
దసరా ఉత్సవాలపై సమీక్ష..
అనంతరం దేవస్థానం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్చించారు. రాష్ట్రం నలుమూలలతో పాటు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని, వీఐపీ దర్శనాలతో పాటు సామాన్య భక్తుల దర్శనం కూడా నిరాటంకంగా కొనసాగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

క్యూలైన్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందస్తుగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులకు ప్రతి దశలో మెరుగైన సేవలు అందేలా అన్ని విభాగాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ లక్ష్యం భక్తులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
