ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరమని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మంద యాకమల్లు మాదిగ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించాలనే డిమాండ్‌తో ప్రారంభమైన ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకానికి దారితీసిందన్నారు. మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలితంగానే లక్షలాది మంది పేదలకు ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పనలో మందకృష్ణ మాదిగ పాత్రను ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలి వెంకన్న మాదిగ, వేల్పుల వెంకన్న మాదిగ, అంజయ్య ముదిరాజ్, ఇదినూరు సోమయ్య మాదిగ, మంద ప్రతాప్ కుమార్ మాదిగ, బంగారు రవీందర్ మాదిగ, యాకయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
