Prime Minister | రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

Prime Minister | రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
Prime Minister | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిక్కిం పర్యటనకు వెళ్లారు. గాంగ్‌టక్‌లో యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించిన ప్రధాని చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కుర్తా-పైజామాలో కనిపించే ప్రధాని మోడీ, ఈసారి ట్రాక్ ప్యాంట్లు, స్పోర్ట్స్ టీ-షర్ట్, ఫుట్‌బాల్ స్పైక్‌లు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గాంగ్‌టక్‌లోని యువ మిత్రులతో కలిసి మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు.

ఈ అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్న ప్రధాని, “గాంగ్‌టక్‌లోని ఈ అందమైన ఉదయం వేళ యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని పేర్కొన్నారు. దీంతో ఆయన పోస్టు వైరల్‌గా మారింది.

అదే సమయంలో సిక్కిం అభివృద్ధికి సంబంధించి ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.4,000 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు పనులను ప్రారంభించారు.
హిమాలయ ప్రాంతాలతో సిక్కిం కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గత ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడిన ఈ పర్యటన ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతోంది.
