ముమ్మరంగా కళ్యాణ మండప నిర్మాణ పనులు

ముమ్మరంగా కళ్యాణ మండప నిర్మాణ పనులు
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో కాపు సంఘీయుల ఎన్నో ఏళ్ల కల అయిన “కాపు కళ్యాణ మండపం” నిర్మాణం శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో చురుగ్గా ముందుకు సాగుతోంది. 2018 సంవత్సరంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ భవన నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరైనప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నిర్మాణ పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కాగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యే ఈ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయింపునకు కృషి చేశారు.
అందులో భాగంగా డిసెంబర్ 5వ తేదీన ఘనంగా శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. భవనం పూర్తయ్యే వరకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని కాపు సంఘ నాయకులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ స్థాయిలో నిరంతరంగా ప్రయత్నించి ప్రస్తుతం రూ.50 లక్షల నిధులతో నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. మిగిలిన భవన నిర్మాణ G+2 పనుల పూర్తి కోసం మరో రూ.1 కోటి పరిపాలన అనుమతుల మంజూరు కొరకు సిఫార్సు చేసి, దాచేపల్లి కాపు సంఘీయుల ఆశయాన్ని సాకారం చేసే బాధ్యతను ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్వయంగా తీసుకున్నారని కాపు సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ప్రతి వర్గO అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకి దాచేపల్లి కాపు సంఘీయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
