నేటి నుంచి డివిజన్ స్థాయిలో ప్రజావాణి

- ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహణ
- డివిజన్ స్థాయి అధికారులు హాజరు
- 30 రోజుల్లో సమస్య పరిష్కరించాలి
- కలెక్టర్ సత్య శారద
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్:ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రజావాణి” కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే డివిజన్ స్థాయి ప్రజావాణి ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమైనదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణి నిర్వహించడం జరుగు తుందన్నది అందరికీ తెలిసిన విషయమైనప్పటికి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్‌డీవో కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ అన్నారు.అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయి అధికారులు డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, ప్రతి వినతికి ప్రత్యేక ధృవీకరణ నంబర్ కేటాయించ బడుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
అందిన ఫిర్యాదులను 30 రోజులలోపు పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.జిల్లా కలెక్టరేట్ మరియు రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయిలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజల పట్ల నిబద్ధత తో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు..
తగ్గనున్న భారం… దొరికేనా పరిష్కారం
స్థానికంగా ప్రజావాణి నిర్వహించడం మూలంగా ప్రజలకు జిల్లా కేంద్రానికి వెళ్లే భాద తగ్గినట్లు అయింది. అయితే అధికారులు ఎంత మేర పని చేసి స్థానికంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు సమస్యల పరిష్కారానికి పాటుపడతారనేది వేచి చూడాల్సిన అంశమే.
