రెండు చుక్కలు.. ఒక నిండు జీవితానికి రక్ష
మంచిర్యాల, ఆంధ్రప్రభ: రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ చిన్నారుల నిండు జీవితానికి రక్షాకవచంలా పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి (ఎంసీహెచ్) ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కలిసి ఆయన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. పోలియో మహమ్మారి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. 0 నుండి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా సమీప కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో చుక్కల ప్రాధాన్యతపై అవగాహన లేని తల్లిదండ్రులకు యువకులు, వృద్ధులు సైతం సమాచారం అందించి చైతన్యపరచాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ చల్లా రమ్య, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
