ప్రత్యేక చిన్నారులకు భవిత్ సేవలు అభినందనీయం
సీబీఆర్ ప్రసాద్, ప్రత్తిపాటి శ్రీధర్
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు వివిధ చికిత్సా సేవలు అందిస్తూ వారి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు అభినందనీయమని ప్రముఖ సామాజిక సేవకులు, సీబీఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు సీబీఆర్ ప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు.

సోమవారం భవానిపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రత్తిపాటి శ్రీధర్, జాగృత భారత్ ఎన్‌జీఓ వ్యవస్థాపకుడు పసుపులేటి గణేష్‌తో కలిసి సందర్శించారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో మమేకమై వారితో సరదాగా గడిపారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి సేవల గురించి భవిత్ ప్రిన్సిపల్ సునీతను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారి భవిష్యత్తును మెరుగుపరిచే బాధ్యతను భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని వారు కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తే ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సీబీఆర్ ప్రసాద్ ఆకాంక్షించారు.
