తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలి
వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
హసన్పర్తి, ఆంధ్రప్రభ: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని హసన్పర్తి మండల వ్యవసాయ అధికారి ఏ. అనురాధ సూచించారు.
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి రైతువేదికలో మూడు రోజుల పాటు నిర్వహించే కంటింజెన్సీ విత్తన మేళాను మండల వ్యవసాయ అధికారి అనురాధ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుమనవాణితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాటు భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటిని ఆదా చేసే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
విత్తన మేళాలో కంది, పెసర, అలసంద వంటి పంటల విత్తనాలతో పాటు సొరకాయ, బీరకాయ, కాకరకాయ, బెండకాయ, టమాట, మిర్చి, పాలకూర, కొత్తిమీర వంటి కూరగాయలు, ఆకుకూరలు, మొక్కజొన్న విత్తనాలను ప్రత్యేక స్టాళ్లలో ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడం వల్ల బోర్లలో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుమనవాణి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఫార్మ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) నిర్మించుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.
దీంతో పంటలకు అవసరమైన నీటిని అందించడంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు కూడా దోహదపడుతుందని చెప్పారు. అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మడిపల్లి సర్పంచ్ బుర్ర రంజిత్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, జయగిరి సర్పంచ్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు సుమన్, సాయి, పంచాయతీ కార్యదర్శులు, ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు, హసన్పర్తి మండల రైతులు, విత్తనాలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
