ప్రజావాణి ఫిర్యాదుకు అరగంటలో స్పందించిన కలెక్టర్

గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ.. ఎంజేపీ బాలుర విద్యాలయ ప్రిన్సిపాల్ సస్పెండ్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే స్పందించారు. ఫిర్యాదు అందిన అరగంటలోనే సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నీటి సరఫరా సమస్యతో పాటు ఇతర సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన కలెక్టర్ విద్యాలయానికి చేరుకుని నేరుగా డైనింగ్ హాల్‌కు వెళ్లారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా వారితో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? భోజనం నాణ్యత ఎలా ఉందని ఆరా తీశారు.

అనంతరం బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, నూనె తదితర ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను పరిశీలించారు. విద్యార్థుల వసతి గదులు, మరుగుదొడ్లను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విద్యాలయంలో నీటి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాను పిలిపించి కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని వేములవాడ మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల రెసిడెన్షియల్ విద్యాలయంలో ఇటీవల తనిఖీ నిర్వహించి నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా ఆ విద్యాలయ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ హెచ్చరించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి పాఠ్యాంశం ముఖ్యమైనదని ప్రణాళిక ప్రకారం చదివి విద్యలో రాణించాలని కలెక్టర్ సూచించారు. వసతులను సద్వినియోగం చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.